Saturday, December 1, 2018

నేనూ - కాళ్ళా by Gangadhara Rao Kadupu [with rare photo of kalla]

From Gangadhara Rao Kadupu:
నేనూ - కాళ్ళా
---------------
నేనూ కాళ్ళా బాల్యమిత్రులం అంటే 1967నుండి మొన్నటి వరకూ.మోహన్,పీకాక్స్ గాంధీ, కాళ్ళా నేనూ సహాద్యాయులం.మరీ ముఖ్యంగా కాళ్ళగారు విజయవాడకు చేరిన 1976 ? వరకూ అది మాకు బంగారు కాలం.యువజన సమాఖ్య,ప్రజానాట్యమండలి కార్య కలాపాలలో పగలూ,రాత్రి తేడా లేకుండా గడిపే వాళ్ళం.మా మకాం సదా ఏలూరులో సీపీఐ ఆఫీసు.ఏలూరులో రిక్షా కార్మికునిగా వుండగానే కాళ్ళ తన చిత్రాలూ,తను చదివి ఆకళింపు చేసుకున్న మార్క్సిస్టు పరిజ్ఞానం ద్వారా చాలా మంది యువతీ యువకుల ను తన మిత్ర బృందం లో చేర్చుకోగలిగాడు.చలంరచనలూ,నండూరి ఎంకిపాటలూ ,అప్పట్లో అత్యద్భుతంగా ఏనదీ తీరానికీ తీసిపోని ఏర్లూరి తమ్మిలేటి చీలిక ప్రాంత విశాల ఇసికతిన్నెలూ కాళ్ళబృందానికి అదనపు ఆకర్షణలు.ఎన్నో పదుల వెన్నెల రాత్రులు ఆ ఇసికతిన్నెల మీద మేం గడపిన జ్ఞాపకాల నాకింకా పచ్చిగానే అనిపిస్తుంటాయ్.మా బృందం సంజీవ్,రమణ,లక్ష్మీ వసంత,విజయ, ఝాన్సీ,శాంత, శారద ,ఫణి, రవీ,శాస్త్తి గార్లతో కళకళలాడుతుండేది.అడపాదడపా అప్పటికే బెజవాడ కు మకాం మార్చి న మోహన్, గాంధీ, శకుంతల ,ప్రకాష్ లు కలుస్తుండేవారు.కమ్మ్యూనిష్ట్ పార్టీల చీలికలు, రష్యా, చైనా వివాదం లాంటి రాజకీయ అంశాలతో పాటు,సమకాలీన సాంఘీక సమస్యలు, చలం,కొకం,గురజాడ, రష్యన్ రచయితల సాహిత్యం, లను చర్చిస్తూ చివరకు పాటలూ ,నృత్యాలతో ఆ సమావేశాలు ముగిసేవి.ఎంకిపాటలలో "చింతపూలా సందట్లో ఆ ఒడ్డూ చేరాల ఏటి వొడ్డునా నా ఎంకి ఎదురొచ్చి నిలవాల"అంటూ కాళ్ళా,శకుంతల చేసే చక్కటి నృత్యాల తో ఆ వెన్నెల సమావేశాలు ముగిసే సరికి తొలికోడి కూసి ఏట్లో ఇసుక కోసం వచ్చే బళ్ళ వాళ్ళ సందడి ప్రారంభమయేది.


"తొండ ముదిరితే ఊసరవెల్లి ఔతుంద"ని సామెత .నిజానికి తొండలూ ,ఊసరవెల్లులూ వేర్వేరు జాతులు. పేదకార్మికుడిగా జీవితం ప్రారంభించిన కాళ్ళగారు 71సంవత్సరాలు ముదిరి కూడా "తొండ"గానే మరణించారు. ఊసరవెల్లి కాాలేదు.మార్క్సిజం, చలం. గార్లను చదవడంవలన ఏర్పడిన విశ్వాసాలు చివరివరకూ. విశ్వసిస్తూనే వున్నారు.     మార్క్సిజం పర్సనాలిటీ డెవలప్ మెఎంట్ అంశం గా చెలం గారి రచనలను యౌవ్వననోద్రేక ప్రేరేప రచనలుగా ఆయనభావించలేదు.ఆ జ్ఞాన సారాన్ని మననసా,వాచా,కర్మణా ఆచరించారు.దానివలన ఆయన సౌకర్యవంతమైన జీవితం గడపలేకపోవచ్చు,కార్లలో తోరగక పోవచ్చు, ఖరీదైన అప్పియరెన్స్ లో కనిపించక పోవచ్చు.ఐతేనేం ఆయన తనలాగే బతికి మరణించిన "ఓన్లీ కాళ్ళ".
(ఊసరవెల్లి అనేది సందర్భాను సరంగా రంగులు మార్చే జీవి)



కాళ్ళ గారితో 1972లో ఒక అపురూప మైన జ్ఞాపకం.నించున్నది ఎడమ చివర నేను (కడుపు గంగాధరరావు),సమత కోటేశ్వరరావు గారు విజయవాడ,సంజీవ్ ఆర్టీసీ, కాళ్ళాగారు. కూచున్నది పీకాక్స్ గాంధీ గారు,ప్రసాద్ విజయవాడ,దుర్గ( ఏలూరు లో మరమగ్గాల కంపెనీ. )ప్రతీ సంవత్సరం జరిగే ఎగ్జిబిషన్ లో రూపాయి ఇచ్చి దిగిన ఫొటో.ఒక సంవత్సరం క్రితం కాళ్ళాగారే నాకు పంపారు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.