https://magazine.saarangabooks.com/%E0%B0%A8%E0%B1%80-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3-%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B0%82/'
నీ ‘కాళ్ళ’ కి సాష్టాంగం!
రేపు… మాపు అని వాయిదా వెయ్యొద్దనుకున్నా ఈ రోజు ప్రయోజనం లేదు, కాళ్ళ నిన్నలలో నిలిచిపోయారు!
‘కాళ్ళ’ గారికి పాతికేళ్ళ క్రితమే నేనో క్షమార్పణ బాకీ పడ్డాను. ఆ బాకీ తీర్చడం ఈ 25 ఏళ్లుగా కుదరలేదు, ఇప్పుడు ఆయనకు కుదరదు. ‘కాళ్ళ’ని క్షమించమని అడగాల్సి వచ్చిన కారణాన్ని చెప్పే ముందు, ‘మో’ (వేగుంట మోహన ప్రసాద్) గారి ఈ కవిత చూద్దాం:
నెత్తుర్నమిలిన కారాఖిళ్ళీ ‘లావా’ లా
వొస్తాయి నీళ్ళు నువ్ దంతధావనం చేసేపుడు
ఆ చప్పుడికి నీ బైపాస్ కార్డియాక్ డిజార్డర్
మరొక్కసారి గోరింటాకు పెట్టుకున్నట్లు నెత్తుర్నములుతూ
రక్తస్పర్శకు నును సిగ్గుపడి అపుడెపుడో
నీ నును రజస్వలానంతర నూగారు మీ
దొలికిన ఆశ్చర్యానందంలోంచి
ఇదేమిటి
ఇలాగేమిటి
ఇట్లా అయితే ఇంకా ఎట్లా
ఏం చేసుకోను దీన్ని
ఎట్లా లిఖించను దీన్ని
ముక్తాక్షరాల్లో
కొండచిలువలా
తొండ పావులా
నిర్గోడ మీద అర్భక బల్లిలా
స్మాల్ స్కై మీది బుల్లి చందమామ కుందేలు పిల్లలా
ఆశ్చర్యానందంలోంచి
టెక్సస్ వస్తాదు రుస్తుమ్మమ్మాయిల
వక్షోజ వికటాట్పటాఫట్ రెజిలింగ్ గుద్దుల్లా
రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’
అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించిన
‘కాళ్ళ’ కేకల్లా ఏ దంతానికి
ఏ రోమం దొరికితే దాన్ని పళ్ళతో పీకి
రోమ్ నించి వొస్తూ వస్తూ
ఇరవయిన్నొక్క వేల లీరాలకి
తెల్లా తెల్లారు జామున
హాయిగా నిశ్వసించటానికని
పన్ను లేని సిగరెట్టు కొంటూ శ్వాస కోశాల్లో
ప్రతి భస్మ అణువులోని భ్రష్టయోగి నిశ్వాసంలో
వొల్చుకున్న ఆశ్వాసాంత పద్యంలా
స్కాచ్ సీసాంత మద్యంలా
ఎలా ఒల్చుకోను నన్ను నేను జాల్ విమానంలో మానంలా
ఎలా దంత ధావనం చేసుకోను ఈ కారాఖిళ్ళీ
ఈ రక్తాక్షరాల ఉమిసిన ప్రేయసి పెదవుల్నించి
కొండనాలుకలోకి కొండచిలువలా
ఉమిసిన లావాలో
ఎలా తోముకోను ఈ మకిలపట్టిన
మాళీ గేదె దేహ సౌందర్య సూర్యదగ్ధ లావణ్యాన్ని
తొలి మబ్బు నును నురగ బుద్బుద సౌందర్యాన్ని?
1984లో ‘అరగుంగో’ శీర్షికన ‘మో’ రాసిన ఈ కవితలో ‘కాళ్ళ’ ప్రస్తావన ఉంది. “రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’/ అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించిన/ ‘కాళ్ళ’ కేకల్లా…” అన్న పాదం దగ్గర ఒక అధోజ్ఞాపిక (footnote ) ఇచ్చి, ‘ప్రముఖ తెలుగు చిత్రకారుడు ‘కాళ్ళ’ – అని పద్యాంతంలో వివరణ ఇచ్చారు ‘మో’.
Argungu Fishing Festival గురించి కూడా ఒక ఫుట్ నోట్ లో ఇలా చెప్తారు: ‘మార్చ్- ఏప్రిల్ మాసాలలో నైజీరియా దేశం మొత్తానికే ఒక పెద్ద పండుగ ప్రదేశం. పెద్ద పెద్ద చేపల్ని పడ్తారు ఆ సమయంలో. కానీ, నీళ్ళు మాత్రం ఎర్రమట్టితో కలిసి ఖారాకిళ్ళీ ఉమిసినట్లుంటాయి.’
ఇంగ్లీషు ప్రొఫెసర్ గా నైజీరియాలో పనిచేశారు ‘మో’. ఇదే కవితకు ఇచ్చిన మరో ఫుట్ నోట్ లో the haves and have-notsకీ మధ్య ఉన్న దూరాల్ని ప్రస్తావిస్తారిలా: “ఆ దేశంలో పేదరికంతో పాటు భయంకరమైన క్యాపిటలిజం సహవాసం చేస్తున్నది. పెట్టుబడిదారులు హాయిగా బాక్సింగ్ క్రీడల్ని చూస్తూ ఉంటారు.” ఆ సామాజిక అంతరాలు, తీవ్రమైన అసమానతలు కవిలో కలిగించిన వేదన, క్రోధం అంతరాంతరాల చేతన నుంచి ఒక ఆకస్మిక ఆత్మగత భాషణై పెల్లుబికింది ‘అరగుంగో’ అంటూ.
చిత్రలేఖనంతో ‘మో’ కవిత్వాక్షరాలకున్న బంధం అపారం. ఆయన తన కవితల్లో Ernst Ludwig Kirchner, Max Beckmann, André Derain, Hermann Max Pechstein, Pablo Picasso, Édouard Manet, Oskar Kokoschka, Otto Muller, Giacomo Balla, Paul Cézanne, Marc Chagall, Henri E B Matisse, Guillaume Apollinaire, Salvador Dalí, Vincent van Gogh, Paul Gauguin….. (ఈ జాబితా అనంతం) వంటి చిత్రకారుల, వారి చిత్రలేఖనాల… Impressionism… Neo-Impressionism… Post-Impressionism ల నుంచి, Symbolism, Expressionism, Cubism, Futurism, Cubist-Realism… ల మీదుగా Surrealism దాటి… అనేకానేక ఆర్ట్ ఉద్యమాల ప్రస్తావన విరివిగా ఉంటుంది.
‘అరగుంగో’ కవితలో ‘కాళ్ళ’ వేసిన ఏదో ఒక బొమ్మని కాదు ‘మో’ refer చేసింది. ‘కాళ్ళ’ కళా మూర్తిమత్వాన్ని మొత్తాన్నీ ఒక పదచిత్రంగా గీసి ప్రదర్శించారు. ‘కాళ్ళ’ (అప్పటికి) గీసిన చిత్రాల సారాంశాన్ని ఒక భావంలోకి తర్జుమా చేస్తే వచ్చిన పదచిత్రం! లమ్డీముండా దేవుడ్నాకొడకా- అది తిట్టు కాదు, నింద కాదు, ఆరోపణ కాదు. ‘దేవుడు చచ్చిపోయాడని, మనమే దేవుడ్ని చంపిన పరమ హంతకులమ’ని నేరాంగీకారానికి పాల్పడే స్థితికి ఒక దశ ముందటి, చావని విశ్వాసాల ఆర్ద్ర… ఆర్త… అసహాయపు పిలుపు- లమ్డీముండా దేవుడ్నాకొడకా! రక్షించమని వేసిన గావుకేకల్లో ఉన్నది- భయం కాదు, విహ్వలత కాదు; పాముని చూస్తే వచ్చే వెరపు, లోయని చూస్తే వచ్చే జడుపు వంటిది కాదు, అసంబద్ధతల్ని చూస్తే కలిగే భీతి, అస్తవ్యస్తాల పట్ల కలిగే విభీతి. ఆ కేకలు వేసిన ‘కాళ్ళ’ – ‘feared’ కాదు, ‘dreaded’!
‘మో’ ది ఒక విలక్షణమైన చూపు. మనుషులు ఆయన కళ్లకి రెండు చేతుల… రెండు కాళ్ల… దేహాలుగా కనిపించరు, సారం వంటి అంతర్లోకపు manifestations గా మాత్రమే కనిపిస్తారు. ఈ కవిత రాసే నాటికి ‘కాళ్ళ’ వయసు- 36 ఏళ్లు. బహుశ, అప్పటికింకా ఖమ్మం మారి ఉండకపోవచ్చు. పువ్వులు సిగ్గుల, పాటలు పరువాల ‘కాళ్ళ’ యవ్వనం, చలం గారి ఛత్రఛాయలో అమీనా.. మైదానాల ఉన్మత్త ఉన్మీలనం, ఐంద్రిక ఐకాంతిక స్వేచ్ఛాప్రణయం, ఐచ్ఛిక దారిద్ర్యం, అధోజగత్ జీవన సాంగత్యం – వీటన్నింటికీ సమాంతరంగా నిరంతరంగా రంగులై రగులుతున్న, కాన్వాసులై కాల్చేస్తున్న ఆర్తితో హృదయం పెడుతున్న ఆర్తనాదం- దాన్ని దర్శించారు… ప్రదర్శించారు ‘మో’!
** ** **

నాకు ‘కాళ్ళ’ తెలిసింది ‘మో’ గారి ద్వారానే. ‘అరగుంగో’ కవిత ద్వారా మాత్రం కాదు, అంతకుముందు, ‘మో’- ఆత్మకథనాత్మక కవిత్వం- ‘బతికిన క్షణాలు’ ముఖచిత్రకారుడిగా! పుస్తకం చదవకముందే దాని మీద సమీక్ష చదవడం ఇష్టం లేదు నాకు. ‘బతికిన క్షణాలు’ ముఖచిత్రం చూసినప్పుడు అనిపించలేదు గానీ, దాన్ని చదివాక, ఆ ముఖచిత్రం కుంచెతో కాళ్ళ రాసిన సమీక్షే అనిపించింది. Temporal art form అయిన కవిత్వ చర్చలో spatial art form అయిన చిత్రకళకి సంబంధించిన రంగులు, ఆకారాలు, పరిమాణాలూ, సంకేతాల్ని Spatiotemporal planeలో అనుసంధానించేందుకు చూశారేమో ‘మో’, ఆ ప్రయత్నాన్నే తన ‘బతికిన క్షణాలు’లో ఇలా అంటారొకచోట:
“అక్షరంలోని ఎక్స్ టెండెడ్ రియాలిటీ (extended reality)ని చూపించాలంటే రంగుల్నీ షేప్స్(shapes)నీ సైజెస్(sizes)నీ, టిక్మర్ నీ స్పేసియో టెంపోరల్ యాక్సిస్ (spatiotemporal axis)లో పిన్నుల్ని గుచ్చుకుంటూపోవాలి.”
ఏ గుండుపిన్నుల్నైతే గుచ్చుకుంటూ పోవాలని ‘మో’ అన్నారో, అవి ‘బతికిన క్షణాలు’ ముఖపత్రంలో నెత్తురోడుతూ కనిపించినప్పుడు నాకు ‘కాళ్ళ’ తొలిసారిగా పరిచయమయ్యారు. ఆ పరిచయం, ‘అరగుంగో’ కవితలో అధోజ్ఞాపికగా మరోసారి ఎదురయ్యి సంపూర్ణమయ్యింది (‘అరగుంగో’ కవిత ‘మో’ 1984 లో ప్రకటించినా, నేను చదివింది మాత్రం ‘రహస్తంత్రి..’ కవితాసంకలనంలో 1991లోనే).
అప్పుడే గట్టిగా అనుకున్నాను, నా కవితాసంకలనానికి ‘కాళ్ళ..’తోనే బొమ్మ వేయించుకోవాలని. అనుకున్నట్టుగానే, మరుసటి ఏడాది 1992 చివర్లో నా ‘రెండ్నిమిషాలు మౌనంగా’ కవితల డ్రాఫ్ట్ పట్టుకొని ఖమ్మం వెళ్ళాను.
“నా మొదటి కవితాసంకలనం అట్ట మీద మీ బొమ్మ, మోహన్ గారి అక్షరాలు ఉండాలని గట్టిగా కోరుకున్నాను ‘కాళ్ళ’ గారూ.. ” అని చెప్పాను, కొంచెం ఆత్రంగా.
‘ఎందుకలా, నా అక్షరాలు బాగుండవా..’ అనే అర్థం వచ్చేలా ఆయన అడిగినదానికి బదులు చెప్పడానికి ఇబ్బందిపడి, ‘అలా ఏమీ కాదు’ అనే అర్థం వచ్చేలా నసిగాను.
“నాక్కూడా కొద్దో గొప్పో అభిమానులుంటారు కదా; ‘కాళ్ళ’కి అక్షరాలు రాయడం రాదనే ప్రచారం వాళ్లు చివుక్కుమనేలా చేస్తుంది కదా. నన్ను ఇష్టపడే వాళ్ల గురించి కూడా నేను పట్టించుకోవద్దా”- అచ్చంగా ఇవే మాటలు ‘కాళ్ళ’ గారు నాతో అన్నది. నాకప్పుడు పాతికేళ్లు, ‘కాళ్ళ’ ఒక ఏడాది అటూ ఇటూ ఇరవై ఏళ్లు పెద్ద నాకంటే.
“నా కవిత్వం చూడకుండానే కండీషన్లు చెప్తున్నారు. అసలు మీరు బొమ్మ వేసే స్థాయిలో నా కవిత్వం ఉందో… లేదో…” ఉక్రోషంగా అన్నాను (‘నా కవిత్వానికి బొమ్మ వేసే స్థాయి మీకు ఉందా’ అని నేను అడిగినట్టే వినబడి ఉంటుంది ‘కాళ్ళ’కి).
కవులకి బొమ్మలు వేయడం ఆంధ్రదేశంలో ఏ ఆర్టిస్టుకైనా కంచిగరుడ సేవే అయినప్పటికీ, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్..’ అన్న లెవల్లో నాకు బొమ్మ వేయడమే నీ జన్మకి సార్థకత అనుకునే కవులకి, ముఖ్యంగా (అప్పటి) యువకవులకి నేనేమీ మినహాయింపు కాదు. బహుశా, అందుకేనేమో తొణకని… బెణకని ఓ చిర్నవ్వు నవ్వారు ‘కాళ్ళ’ నా మాటలకి. గిర్రున వెనక్కి వచ్చేశాను, ఖమ్మం నుంచి హైదరాబాద్.
‘మో’ ని చూసి, ‘మో’ కళ్ళతో ‘కాళ్ళ’ని చూసి కూడా, ‘కాళ్ళ’ని రోమత్వఙ్మాంసాస్థిస్నాయుమజ్జాప్రాణాల సప్తధాతు సమ్మేళనంగానే కుదించుకొని, వెనక్కి వచ్చేశాను. ఎడతెగని ఎన్నెల సోనలకి పైకప్పుల అడ్డూఆపు లేని ఏలూరు శివారు మొండిగోడల ఇళ్లు- ‘కాళ్ళ’ ఎంకి పాటల మార్దవానికి జోగుతుండేవట, ఉరువు దరువుల ఆయన చిందుకి తూగుతుండేవట. మాసిన గడ్డంతో రికామీ విసురు గాలి వంటి కూరిమికాడు ‘కాళ్ళ’ అంటే ముదిగారంగా మూగే నేస్తురాళ్లకి భలే మోజట (ఏలూరు రమణ గారు (ఇప్పుడు లేడు), ప్రకాష్ గారు కథలుగా చెప్పేవారు). ‘అంతమంది అమ్మాయిల్ని ఆకర్షించిన ఏమంత రూపసి’ అన్న ఉక్రోషంతో చూశానేమో, ఆనాడు ఖమ్మంలో ‘కాళ్ళ’ని. ‘కళలలో రాచరికముంటుంది. ఒక సింహాసనం వుంటుంది. కిరీటాన్ని తన ఖడ్గంతో తీసుకుని శిరస్సుపై వుంచుకునే పొగరుమోత్తనం వుంటుంది,’ అంటారు కవి, కథకులు, ఫణికుమార్ (ఐఏఎస్). దానితో ఎంతో అంగీకారం ఉండి కూడా, కాసేపు కావరంతో ఏమారి, ‘మనుషులంతా ఒక్కటే.. ‘ తరహా సమానత్వ భ్రమతో బహుశా ‘కాళ్ళ’తో మాట్లాడి (పోట్లాడి) ఉంటాను.
ఇప్పుడిలా introspection తో అంటున్నానేగానీ, అప్పుడైతే నా ఉక్రోషం తగ్గలేదు. ‘కాళ్ళ’ బొమ్మా వద్దూ, మోహన్ అక్షరాలూ వద్దు- అని కొమ్మల జుత్తు విరబోసుకున్నట్టున్న ఓ trick photo ని కవర్ పేజీగా ఎంచి, మా శ్రీధి (పసునూరు శ్రీధర్ బాబు) తో అక్షరాలు రాయించుకున్నాను. అయితే, ‘కాళ్ళ’తో అవమానకరంగా ప్రవర్తించాను అన్న బుద్ధి కలగడానికి నాకు మరో ఏడాది పట్టింది.

నా పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి ‘మో’ గారి ఇంటికెళ్ళాను (1993 డిసెంబర్). అప్పుడే sample గా వచ్చిన ‘పునరపి ‘ కాపీ మీద ‘ఉష- నరేష్ కి పెళ్లికానుకగా…’ అని రాసిచ్చారు ‘మో’. పునరపి ముఖచిత్రం- అర్ధనారీశ్వరం- ‘కాళ్ళ’ పెయింటింగ్; అక్షరాలు కూడా ‘కాళ్ళ’వే. ‘కాళ్ళ’లానే, ‘కాళ్ళ’బొమ్మల్లానే రక్షించు ‘లమ్డీముండా దేవుడ్నాకొడకా’ అని ఆకాశంలోకి చేతుల్నెత్తి ప్రార్థించినట్టే ఉన్నాయి, ‘పునరపి’కి ఎంతో నప్పుతూ. కానీ, మరో రెండు నెలలకి ఆవిష్కరింపబడిన ‘పునరపి’ కవర్ మీద ‘కాళ్ళ’ బొమ్మ; అక్షరాలు మాత్రం మోహన్ గారివి.
దాన్ని చూడ్డంతోటే ఆ రోజు ‘కాళ్ళ’ గారు నాతో అన్న మాటలు ఛళ్లున ముఖం మీద చరిచినట్టు గుర్తొచ్చాయి. అప్పుడు కలిగింది పరితాపం… పశ్చాత్తాపం. ఆ క్షణమే ‘కాళ్ళ’ని కలిసి క్షమించమని అడగాలనిపించింది. ‘కాళ్ళ’ని కలవాలి రేపు- అనుకుంటూ ఈ పాతికేళ్లుగా దాన్ని వాయిదా వేస్తూనే ఉన్నాను. రేపు… మాపు అని వాయిదా వెయ్యొద్దనుకున్నా ఈ రోజు ప్రయోజనం లేదు, కాళ్ళ నిన్నలలో నిలిచిపోయారు!
*
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.