Saturday, December 1, 2018

kalla by Kopparthi [poet]


ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. కిందిది  కాళ్ల గారు నా తొలి కవిత్వసంపుటి 'పిట్టపాడేపాటకోసం' కు 1991 లో వేసిన ముఖచిత్రం. అవి కవిత్వసంపుటాలకు కాళ్ల గారి ముఖచిత్రాల హవా ప్రారంభమైన రోజులు. అప్పటికే మో, పాపినేని, అఫ్సర్ వంటి కవుల సంపుటులకు ఆయన ముఖచిత్రాలు రావడంతో నేనూ వేయించుకోవాలని ఇష్టపడ్డాను. ఖమ్మం లో వుంటారని తెలిసి గంగాధర్ గారూ నేనూ వెళ్లాం. కాదు కాదు గంగాధర్ గారు నన్ను తీసుకెళ్లారు( తమ చిన్నప్పటి ముచ్చట్లు చెబుతూ). ఆచిన్న స్టుడియో లోనే కలిశాం. కొన్నికవితల్ని ఇస్తూ 'పిట్టపాడేపాటకోసం' కవితకు అనుగుణంగా బొమ్మ వేసివ్వమని అడిగి వచ్చేశాం. రెండు మూడు నెలలకుపైగా ఎదురుచూసినా బొమ్మరాలేదు. ఆలస్యం ఐపోతూండడంతో మళ్లీ గంగాధర్ గారి పనుపు మీదా, జయధీర్ తిరుమల్రావు గారి సహకారం తో మోహన్ ను కలిసి, ఒకరోజంతా ఆయనతోనే వుండి బొమ్మవేయించుకుని ఇల్లుచేరానో  లేదో కాళ్ల గారినుంచి బొమ్మ వచ్చింది. ఐతే నేనడిగిన బొమ్మకాకుండా నేనిచ్చిన కవితల్లో  ఆయనకు నచ్చిన 'ఆకలి నైరూప్యంకాదు' కవితకు బొమ్మవేసి పంపారు. ఏంచెయ్యాలో తోచలేదు. Title మార్చడం నాకిష్టం లేదు. బొమ్మ వేసుకోకుండా కాళ్లగారిని అవమానపరచడమూ ఇష్టం లేదు. ఈ సందిగ్ధం లో మోహన్ గారి బొమ్మనేంచెయ్యలో తెలీలేదు. చివరికి ముగ్గురికీ న్యాయం జరిగేటట్టు title అలాగే వుంచి కాళ్ల గారి బొమ్మతో, మోహన్ అక్షరాలతో పుస్తకం వేసాను. చూసేవాళ్లకు కొంత గందగోళం కలిగించేటట్టున్నా చిత్రకారులిద్దరినీ అగౌఅరవపరచలేదనే తృప్తి మిగిలింది. పిట్టపాడేపాట ను కాదని నైరూప్యమైన ఆకలికి రూపం ఇవ్వడంలోనే కాళ్ల గారి స్వభావమూ, ఆయన కుంచె లోని అభావమూ ఇమిడి వున్నాయి. కాళ్ల, మోహన్ గార్లకు అంజలి !!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.